Short Story: అతను-దేశం
- Charan Amaravadi
- Dec 4, 2024
- 1 min read
Updated: Jul 25
అతను,దేశంలా ఉన్నాడు.!
అతను, కోర్టులో కదలని కేసుల్లా చాలా సేపటి నుండి అలగే కదలకుండా పడి ఉన్నాడు.
ఆకులు రాలి ఎండిపోయిన చెట్టు నీడలో అతన్ని చూస్తే,లొసుగులతో ఉన్న చట్టాల నీడలో సామాన్యుడి భద్రత గుర్తొచ్చింది.
లోతుగా ఉన్న అతని కళ్లలో జీవం, ప్రజల్లో ఒకరి మీద ఒకరికి ఉండే నమ్మకంలా క్షీణిస్తూ ఉంది.
అదిగో,కొద్దిరోజుల్లో ఎలక్షన్లుంటే వేస్తున్న తారు రోడ్డు.దాని మీద నుంచి వచ్చే వేడి సెగలా ఉంది అతని నిట్టూర్పు. స్థిరంగాలేని అతని శ్వాస రూపాయి విలువను గుర్తుచేస్తూ ఉంది.
బీటలు వారిన అతని నాలుకను కన్నీటితో తడుపుకుంటూ ఉన్నాడు.చెమట కన్నా అది పవిత్రమైనది అని అనుకున్నాడేమో. కానీ రెండూ కూడా, ప్రజల్లో దేశభక్తిలాగా ఇంకి పోతున్నాయి.
విపరీతంగా పెరుగుతున్న జనాభాలా అతని జ్వరం పెరుగుతూ ఉంది. మీడియోక్రసీ తో నిండిన జనాల మెదల్లలా అతని శరీరం మొద్దుబారిపోయింది.
డబ్బులిస్తే కాని పని చేయమనే అధికారుల్లాగా వాడి గుండె కూడా పని చేయటానికి మొరాయిస్తుంది.
‘మార్పు’ ఎప్పుడొస్తుందా అని చూసే సగటు పౌరుడి ప్రశ్నలాగా,‘మార్పు’ ఎప్పటికైన వస్తుందిలే అనుకునె కొద్దిమంది ఆశలాగా,‘మార్పు’ కోసం ప్రయత్నించే అతి కొద్ది మంది ధైర్యంలాగా, బతుకు మీద ఆశ యొక్క తీవ్రత ఎక్కువ నుండి తక్కువకి పడిపోతూ ఉంది.
దీనికి తోడు తీవ్రవాద ముప్పులా ఎండ, మనిషిని మరింత బలహీనం చేస్తుంది.
ఇంతలో ఒకడు వచ్చి పక్కన కూర్చుని, “మనిషి చచ్చిపోతున్నాడు బాబు కాపాడండయ్యా” అని అరుస్తున్నాడు. జనాలు కొంత డబ్బు వేయగానే అవి తీసుకుని వాడెళ్లిపోయాడు.
దేశం లాంటి ఆ మనిషిని అమ్మేసాడు.!
వాడు అలానే ‘నీరసంగా’ పడి ఉన్నాడు.
నేను ‘కుతూహలంతో’ అలా చూస్తూనే ఉన్నాను.
తరువాత ‘డ్రామా’ ఏమీ జరగడం లేదు. నాకు ‘బోర్’ కొడుతోంది.
ఎప్పుడోగాని రాని యువత ఆవేశంలా ఒక్కసారిగా గాలి వచ్చి,వాడి వంటి మీదున్న ఆ ఒక్క పంచెని తీసుకెళ్లిపోయింది.
చట్టాలు,న్యాయాలు,మతాలు,ధర్మాలు,దేశాలు,భాషలు,హిపోక్రటికల్ ఇజాలు,ఇలాంటి ముసుగులన్ని పొరలు పొరలుగా విడిపోయి ‘నేను ఒక మనిషిని మాత్రమే’ అనే నిజాన్ని నగ్నంగా చూపెడుతున్నట్టుంది.
ఇంతలో ఎవరో వచ్చి అతనికి నీళ్లు ఇచ్చి,అన్నం పెట్టి, వంటి మీద గుడ్డ కప్పారు.
దేశంలాంటి అతన్ని కాపాడారు.
కథ సుఖాంతమైంది……
…....అని అనుకున్నాను.!
అతను దేశమే…….మరి నేను..?
Written By
ARK
Comments