కైలాసంలో వేణుగానం
- Charan Amaravadi
- Dec 21, 2024
- 1 min read
Updated: Jul 25

చరణ్ - తాత, ఎవరేమనుకుంటారో అనే భయం లేకుండా అక్కడ ఆడుకుంటున్న పిల్లలు లాగా మనం ఉండలేమా?
తాత - మన ఆనందాలు మన…
చరణ్ - 'మన ఆనందాలు మనవే, ఎవరి గురించి పట్టించుకోవద్దు' ఇలాంటివి వద్దు తాతయ్య.
తాత - మన ఆనందాలనీ, మన బాధలను, మన అనుభూతులన్నింటినీ, వేరే వాళ్ళ అభిప్రాయాలతో dilute కాకుండా కాపాడుకోవడం ధ్యానం. కానీ, అది అంత సులువు కాదు. అలా చేయడం యోగులు వల్ల మాత్రమే కుదురుతుంది. కైలాసంలో శివుడిలాగా…
ఐహిక సుఖాలకు దూరంగా ధ్యానంలో ఉంటాడు కాబట్టి ఆది యోగి అని, ప్రేమగా వరమిచ్చినా… కోపంగా మూడో కన్ను తెరిచినా, వేరే ఏ ఆలోచన లేకుండా, చిన్న పిల్లాడి లాగా తీర్చేసుకుంటాడు కాబట్టి భోళా నాథుడు అని పిలిపించుకోవట్లేదూ.
చరణ్ - కానీ అలా ఉండటం అందరివల్ల కాదు కదా. Man is a social animal అంటారు. మరి ఆ Social vs Individual Equationని balance చేయడం ఎలా? జనంతో ఉంటూ ఆనందంగా ఉండలేమా?
తాత - ఆ జనాన్ని మన ఆనందంలో కలిపేసుకుంటే పోలే?
చరణ్ - అంటే?
తాత - అంటే… డాన్స్ చేస్తే వాళ్లేమనుకుంటారో అని అనుకునే బదులు వాళ్ళని కూడా నీతో పాటు డాన్స్ చేపిస్తే సరి. బృందావనంలో శ్రీకృష్ణుడిలాగా..!!!
తన మాటతోనో, తన పాటతోనో, తన ఆటతోనో, తన నటనతోనో, లేదా తనకి నచ్చిన ఏదో ఒక పనితోనో, అవతల వారిని సమ్మోహనపరిచి వారిని కూడా తనలానే ఆడించి, పాడించి, ఆలోచింపజేసి, తనలో కలిగే స్పందనల్ని అందరిలో కలిగేలా చేయడమే కళ.
తనలో చిగురించే పూరెమ్మల్లాంటి స్పందనల్ని ఈ రాతి ప్రపంచం చిదిమేయకుండా కాపాడుకునే వాడు యోగి. ఆ రాయిని కరిగించి, అందరి మనసులో పూలు పూయించేవాడు కళాకారుడు.
చరణ్ - అంటే మీరు Philosophy కంటే Art గొప్పది, శివుడి కంటే కృష్ణుడు గొప్పవాడని చెప్తున్నారా?
తాత - అల్లరి చేసే అలల లోతుల్లో గంభీరమైన సముద్రం ఉంటుంది. సముద్రం, అల…రెండూ వేరు వేరు కాదు. అలా అని ఒక్కటి కూడా కాదు.
అదే అద్వైతం.
Written By
ARK
Comments